క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఆర్.కె 5 గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝ
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికులు తమ విధులతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటడం అభినందనీయమని ఆర్.కె 5 గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝ కొనియాడారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 5 గనిలో విధులు నిర్వహిస్తున్న రిలే ఏ ఉద్యోగులకు బుధవారం ఆయన బహుమతులను అందజేశారు. ఇటీవల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో రిలే ఏ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా టీం సభ్యులు బండ అశోక్, గొట్టే విజయ్, రాజమౌళి, అరుణ్‌లను మేనేజర్ ప్రత్యేకంగా అభినందిస్తూ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ కార్మికులు గని లోపల కఠినమైన విధులు నిర్వహిస్తూనే, క్రీడల పట్ల ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావంతో క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వానికి తోడ్పడటమే కాకుండా, పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఎల్లప్పుడూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ రాందాస్, సర్వేయర్ సంపత్, పిట్ కార్యదర్శి నరసింగ రావు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, సూపర్వైజర్ పిన్నింటి మల్లారెడ్డి, ఇతర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.







