టీఎన్జీవోస్ కాలనీలో 200 మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన ప్రకృతి మిత్ర సంస్థ
నస్పూర్, ఆర్.కె న్యూస్: జలాశయాలు, జీవవైవిధ్యం, మానవ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన పూర్వీకులు ఆచరించిన బంకమట్టి వినాయకుడిని పూజించడమే అసలైన భక్తి, సంప్రదాయం అని రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ అథారిటీ సభ్యులు, ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు గుండెటి యోగేశ్వర్ పేర్కొన్నారు. మంచిర్యాల కలెక్టరేట్ రోడ్డులోని టీఎన్జీవోస్ కాలనీ శ్రీ
సిద్ధి వినాయక గణేష్ మండలి ఆవరణలో ఆదివారం ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో 200 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యోగేశ్వర్ మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల నీటిలోని ఆక్సిజన్ శాతం తగ్గి జలచరాలు, ఆ నీరు తాగే పక్షులు, మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రసాయన రంగులతో విగ్రహాలు తయారు చేసే కార్మికులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. నవరాత్రి పూజల్లో మహిళలు ప్లాస్టిక్ బుట్టల స్థానంలో వెదురు, స్టీలు బుట్టలను, ప్రసాదాల వితరణకు ఆకు డొప్పలను వినియోగించాలని సూచించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. సిద్ధి వినాయక గణేష్ మండలి వేడుకల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి, పర్యావరణ హితంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టిన గుండెటి యోగేశ్వర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నెక్స్ ఐరా ఐటీ కంపెనీ ఎండీ మోతే శరత్ చంద్ర మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఇలాంటి మంచి కార్యక్రమాలకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ ముఖ్య నాయకులు పొన్న మల్లయ్య, శ్రీపతి బాబురావు, బి. రామ్మోహన్, కే. నాగేశ్వరరావు, ఎస్. మొండయ్య, ఎన్. సత్యనారాయణ, టి. తిరుపతి, జి. వెంకటేశం, ప్రకృతి మిత్ర సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.







