పాత మంచిర్యాల రామాలయంలో రూ. 30 లక్షల కమ్యూనిటీ హాల్ పనులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు శంకుస్థాపన
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: ప్రజా అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్
పరిధిలోని 14వ డివిజన్ పాత మంచిర్యాలలోని పురాతన శ్రీ రామాలయం–శివాలయం–భక్త ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో సుమారు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రజల మౌలిక వసతుల కల్పన దిశగా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. అనంతరం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తయారు చేసిన పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే భక్తులకు పంపిణీ చేశారు. ప్రకృతిని, జలాశయాలను కాపాడేందుకు మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు, స్థానిక కార్పొరేటర్ తూముల నరేష్, డివిజన్ నాయకులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కార్పొరేటర్లు, పార్టీ జిల్లా, డివిజన్ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, స్థానికులు పాల్గొన్నారు.







