కనీస వేతనాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో ఎనిమిదేళ్లుగా ప్రాజెక్ట్ ఇంజనీర్ వాహనంపై విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కన్వేయన్స్ డ్రైవర్‌ను కొత్త టెండర్ పేరిట అకారణంగా తొలగించడం దారుణమని డ్రైవర్ల సంఘం మండిపడింది. బాధితుడికి న్యాయం చేయాలని కోరుతూ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ (కనీస వేతనాల మండలి చైర్మన్)కు యూనియన్ నాయకుడు జీవన్ జోయల్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై జనక్ ప్రసాద్ సానుకూలంగా స్పందిస్తూ బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ, భూనిర్వాసితుల ఉపాధి కోసం ఉద్దేశించిన కన్వేయన్స్ టెండర్లలో కొందరు గుడ్‌విల్ పేరిట సిండికేట్‌గా మారి, ఏళ్ల తరబడి పనిచేస్తున్న నిరుపేద డ్రైవర్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం జోక్యం చేసుకుని అక్రమ తొలగింపులను తక్షణమే నిలువరించాలని, లేనిపక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కన్వేయన్స్ డ్రైవర్ల సంఘం (SCKIS-CTU) శ్రీరాంపూర్ డివిజన్ అధ్యక్షుడు కాసీపేట రాజేశం, పిట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పత్తి రాజలింగు, ప్రచార కార్యదర్శి కలవేని సతీష్ కుమార్, నాయకులు శశిధర్, మల్లేష్, అనిల్, అసల మల్లేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.







