రూ. 60 వేల కోట్ల బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు రవాణా బంద్
ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియలో భాగంగా మెడికల్ ఫిట్ అయిన అర్హులైన అభ్యర్థులకు నవంబర్ 4వ తేదీలోగా నియామక పత్రాలు అందజేయాలని, లేనిపక్షంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల జీఎం కార్యాలయాల ఎదుట భారీ ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు. గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు రావాల్సిన సుమారు రూ. 60,000 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. బకాయిల రికవరీ కోసం గత నెలలో విద్యుత్ సౌధ ఎదుట ధర్నా నిర్వహించామని, ప్రభుత్వం స్పందించకపోతే సీహెచ్పీల నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు వెళ్లే బొగ్గు సరఫరాను పూర్తిగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ బకాయిలను రాబట్టడంలో సింగరేణి అధికారులు చొరవ చూపాలని కోరారు. గనుల్లో కార్మికులకు డ్రిల్ బిట్లు, సేఫ్టీ షూస్, గ్లౌజులు, డ్రెస్ మెటీరియల్ వంటి ప్రాథమిక రక్షణ పరికరాల కొరత తీవ్రంగా ఉందని, వెంటనే వాటిని సమకూర్చాలన్నారు. యాజమాన్యం గుర్తింపు సంఘంతో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలపై తక్షణమే సర్క్యులర్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సొంత ఇంటి పథకం అమలు, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను యాజమాన్యమే భరించేలా కృషి చేస్తున్నామని, మారుపేర్ల సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్నారు. రెండేళ్ల కాలపరిమితి ముగియగానే ఎన్నికల పేరుతో కోర్టులను ఆశ్రయిస్తున్న ఇతర సంఘాల తీరును తప్పుబట్టారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె. వీరభద్రయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, కాంట్రాక్ట్ కార్మిక సంఘం రీజియన్ సెక్రటరీ అఫ్రోజ్ ఖాన్, నాయకులు సుధాకర్, పెద్దన్న, రాజ్‌కుమార్, నారాయణ, వెంకటస్వామి, కోడి వెంకటేశం, వెంకటేష్, సుభాష్, దుర్గారెడ్డి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.








