నస్పూర్, ఆర్.కె న్యూస్: హాజీపూర్ మండలం గుడిపేటలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకత, కళాత్మక ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఒకటి, రెండో తరగతి చిన్నారులకు నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో రంగురంగుల వేషధారణలు ఆకట్టుకోగా, పైతరగతుల విద్యార్థుల గ్రూప్ డ్యాన్స్ ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ లోకేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… బాలల దినోత్సవ ప్రాముఖ్యతను, పిల్లలపై నెహ్రూజీకి ఉన్న అపారమైన ప్రేమాభిమానాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
14







