⚪ 32వ డివిజన్‌లో నూతన గృహాన్ని ప్రారంభించిన మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: అర్హులైన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆత్మగౌరవంతో కూడిన సొంతింటిని కల్పించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. శుక్రవారం 32వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు అన్నం అశోక్ – చంద్రకళ దంపతుల నూతన గృహాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ప్రత్యేక చొరవ, కృషితో నియోజకవర్గంలో అర్హులైన పేదలకు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.







