శ్రీరాంపూర్ ఆర్.కె-7 భూగర్భ గనిని సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి నిరోష
నస్పూర్, ఆర్.కె న్యూస్: దేశానికి వెలుగులు పంచేందుకు చీకటి గనుల్లో సింగరేణి ఉద్యోగులు పడుతున్న కష్టాన్ని ప్రత్యక్షంగా చూడటం ఒక ప్రత్యేక అనుభూతి అని మంచిర్యాల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, సీనియర్ సివిల్ జడ్జి నిరోష పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 భూగర్భ గనిని ఆమె సందర్శించారు. గని అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్లోకి వెళ్లి పని ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బొగ్గు ఉత్పత్తి తీరుతెన్నులు, వివిధ విభాగాల ఉద్యోగుల పనితీరును జడ్జి నిరోష ఆసక్తిగా గమనించారు. గని విస్తీర్ణం, ఉత్పత్తి లక్ష్యాలు, ఉద్యోగుల పని విధానం, రక్షణ కోసం యాజమాన్యం చేపడుతున్న చర్యలను గని మేనేజర్ జె. తిరుపతి ఆమెకు వివరించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చమటోడ్చుతున్న ఉద్యోగుల భద్రతకు సింగరేణి సంస్థ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందనే విషయం లోపలి పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోందన్నారు. ముఖ్యంగా సేఫ్టీ విషయంలో యాజమాన్యం చేపడుతున్న చర్యలు అభినందనీయమని ప్రశంసించారు. ఈ గనితో పాటు సింగరేణి సంస్థ భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించి, పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ జె. తిరుపతి, డిప్యూటీ మేనేజర్ వెంకట్రామ్, సీనియర్ పీఓ సంతన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.







