ఈ నెల 19న శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో భారీ వేడుక
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి చరిత్రలో మొదటిసారి కార్మిక క్రీడాకారులు, కళాకారులు, అధికారులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నామని కార్యక్రమ నిర్వాహకులు గూడూరి యాదిరెడ్డి, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఈసంపెల్లి రాంచందర్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం సీఈఆర్ క్లబ్‌లో ఈ నెల 19న ఆదివారం నిర్వహించనున్న ఉద్యోగ క్రీడాకారులు, కళాకారులు, అధికారుల మహా ఆత్మీయ సమ్మేళనం వాల్ పోస్టర్‌ను శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో విడుదల చేశారు. శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే ఈ సమ్మేళనానికి సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి, సంస్థ డైరెక్టర్లు ఎల్పీ సూర్యనారాయణ, కే. వెంకటేశ్వర్లు, ఎం. తిరుమల్ రావు, డీసీపీ ఎగ్గడి భాస్కర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. 1992లో ఏర్పాటైన ప్రగతి స్టేడియం ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిందని నిర్వాహకులు గుర్తు చేశారు. ఇక్కడి కార్మికులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలతో పాటు కోల్ ఇండియా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి గుర్తింపు తెచ్చారు. సింగరేణి యాజమాన్యం ప్రోత్సాహంతో వేలాది మంది కార్మికుల బిడ్డలు, నిరుద్యోగ యువత క్రీడల ద్వారా ఉద్యోగాలు సాధించారని వివరించారు. ఈ భారీ సమ్మేళనం ద్వారా పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడంతో పాటు ప్రతిభావంతులను గౌరవించుకోవాలని నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీరాంపూర్ కాలనీ ఎస్ బి ఐ గ్రౌండ్ నుంచి క్రీడాకారుల ర్యాలీ ప్రారంభమై ప్రగతి స్టేడియం వరకు కొనసాగుతుంది. అనంతరం ప్రారంభమయ్యే సమ్మేళనంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు సన్మానం చేస్తారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు గోవర్ధన్ రెడ్డి, శ్యాంసుందర్, రాళ్లబండి రాజన్న, ఎద్దు సదయ్య, గద్దల భానయ్య, భానుప్రకాష్, బాబురావు, శేషగిరిరావు, సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.







