రవీంద్రభారతిలో ఘనంగా చార్లీ చాప్లిన్ 137వ జయంతి వేడుకలు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా గురువారం రాత్రి మీడియా టుడే మంచిర్యాల జిల్లా ప్రతినిధి తేళ్ల విజయ్ కుమార్ ‘జర్నలిస్ట్ సేవా పురస్కారాన్ని’ అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో వరంగల్ రోజా క్రియేషన్స్ నిర్వహించిన చార్లీ చాప్లిన్ 137వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను ఈ సందర్భంగా సన్మానించారు. శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోజా క్రియేషన్స్ అధినేత ఆలేటి శ్యాంసుందర్, నటుడు శివారెడ్డి, జబర్దస్త్ ఫేమ్ రాకేష్, సుజాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 25 ఏళ్లుగా చార్లీ చాప్లిన్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ కళాకారులకు, ముఖ్యంగా హాస్య నటులకు పెద్దపీట వేస్తున్నట్లు శ్యాంసుందర్ తెలిపారు. సన్మానం అందుకున్న విజయ్ కుమార్ కళారంగంలో 38 ఏళ్లుగా, జర్నలిజంలో 15 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. కళాకారుల ఎదుగుదలకు రోజా క్రియేషన్స్ అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని జబర్దస్త్ రాకేష్ పేర్కొన్నారు. సంస్థ అందించిన సహకారమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని తెలిపారు. ఈ వేడుకల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, కళాకారులు, రచయితలు పాల్గొన్నారు. సీనియర్ మైమ్ కళాకారులు కళాధర్, మధు తదితరులు హాజరై ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు.







