గెజిట్లో ప్రత్యేక గుర్తింపునకు నేతకానీ మహర్ సంఘం వినతి
ఆర్.కె న్యూస్, నస్పూర్: నేతకాని కులస్తులు మాలలకు ఉపకులం కాదని నేతకాని మహర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సునార్కర్ రాంబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి గోళ్ల రాజమల్లు స్పష్టం చేశారు. తెలంగాణ ఎస్సీ వర్గీకరణ, కులగణనలో తమ సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ ఆదేశాల మేరకు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ గెజిట్ లో మాలసాలె, నెట్కాని పేర్లను తొలగించాలని నాయకులు కోరారు. తమను నేతకానీలుగా గుర్తించి అధికారికంగా పేరు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ సామాజిక వర్గం 15 లక్షలకు పైగా జనాభా కలిగి ఉందని వివరించారు. ప్రస్తుతం కుల ధ్రువీకరణ పత్రాలు నేతకానీలుగానే తీసుకుంటున్నామని గుర్తు చేశారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే, కుల గణనలో నేతకాని పేరును తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జనాభా సంఖ్యను కూడా చూపించలేదని మండిపడ్డారు. తమకంటే తక్కువ జనాభా ఉన్న కులాలను ధృవీకరించిన ప్రభుత్వం 15 లక్షల పైబడి ఉన్న తమను గుర్తించకపోవడం సరికాదన్నారు. నేతకానీ జనాభా సంఖ్యను అధికారికంగా తెలపాలని కోరారు. తమను మాలలతో కలిపి ఉన్న గ్రూపు నుండి తొలగించాలని, మొదటి గ్రూపులో చేర్చి 3 శాతం రిజర్వేషన్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పెరుగు తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి కొండ గొర్ల శ్రీనివాస్, జునుగురు లక్ష్మణ్, జాడి శ్రీనివాస్ పాల్గొన్నారు.







