మంగళవారం అవార్డుల ప్రదానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. ఆర్.కె 7 భూగర్భగని సీనియర్ అండర్ మేనేజర్ ఎం. శశాంక్ ఏరియా స్థాయి ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు పొందారు. ఎస్సార్పీ 3 గని హెడ్ ఓవర్మెన్ బోగె మోహన్ దాస్ కంపెనీ స్థాయి ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యారు. మంగళవారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో జరిగే వేడుకల్లో శశాంక్ ను ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ సత్కరిస్తారు. కంపెనీ స్థాయి అవార్డుకు ఎంపికైన బోగె మోహన్ దాస్ కొత్తగూడెంలో జరిగే ప్రధాన వేడుకల్లో సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు. ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన ఇరువురికి ఏరియా అధికారులు, మైనింగ్ సిబ్బంది, తోటి కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు.








