- మెడికల్ ఫిట్ అయిన వారికీ ఉత్తర్వులు ఇవ్వకపోవడం యాజమాన్య వైఫల్యమే
- ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్ లకు సంవత్సర కాలం గడుస్తున్నా రాజకీయ జోక్యం వల్లే యాజమాన్యం నేటికీ నియామక ఉత్తర్వులు జారీ చేయడం లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు, వేజ్ బోర్డ్ శాశ్వత సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య విమర్శించారు. శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం కార్మికులు, డిపెండెంట్లు భారీ ధర్నా నిర్వహించారు. మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేయాలనే డిమాండ్‌తో ఈ నిరసన చేపట్టారు. అనంతరం జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ కు వినతిపత్రం సమర్పించారు. వైద్య పరీక్షల్లో అర్హత సాధించిన 400 మందికి పైగా డిపెండెంట్ ల పోస్టింగ్ లను పెండింగ్‌లో పెట్టడం యాజమాన్య వైఫల్యానికి నిదర్శనమని వాసిరెడ్డి సీతారామయ్య మండిపడ్డారు. దీనివల్ల బాధితులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. నియామకాలు చేపట్టని పక్షంలో రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కె బాజీ సైదా, ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు, సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, యూనియన్ నాయకులు నాగభూషణం, అఫ్రోజ్ ఖాన్, గునిగంటి నర్సింగరావు, నాగేశ్వరరావు, రమేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో డిపెండెంట్లు పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు.







