- రూ. 30 కోట్లతో ఆధునిక బస్టాండ్, విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణం: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి విద్య, వైద్య రంగాలకు ప్రధాన కేంద్రంగా మారుస్తామని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం కాలేజ్ రోడ్డులోని పద్మనాయక
ఏసీ ఫంక్షన్ హాల్‌లో ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ, చారిత్రక శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పుర ప్రముఖుల కోసం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు మాట్లాడుతూ.. మంచిర్యాల ఆర్టీసీ డిపోను సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 9 ప్లాట్‌ఫామ్‌ల స్థానంలో 18 ప్లాట్‌ఫామ్‌లు, ప్రయాణికుల కోసం అత్యాధునిక విశ్రాంతి గదులు, మినీ థియేటర్, షాపింగ్ మాల్ తదితర సకల హంగులను కల్పించనున్నట్లు తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా, దేవాదాయ శాఖ వాస్తుశిల్పి సూచనల మేరకు శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టామని, రాబోయే పుష్కరాల నాటికి ప్రధాన శివాలయాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రస్తావిస్తూ.. అధికారుల మాదిరిగానే కార్మికుల ఆదాయపు పన్నును కూడా యాజమాన్యమే భరించేలా తాను చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపారని వివరించారు. అలాగే అవినీతికి ఆస్కారం లేకుండా సింగరేణి మెడికల్ బోర్డులను కొత్తగూడెంలో కాకుండా ఏరియాల వారీగా నిర్వహించి, పరీక్ష ఫలితాలను అదే
రోజు వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్లు రామగిరి బానేష్, అక్కల వెంకటేశ్వర్లు, జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు పూదరి తిరుపతి, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి గుండ సుధాకర్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు నలిమెల రాజు, సయ్యద్ షాహిద్ అలీ, జిల్లా ఆర్‌జీపీఆర్‌ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, సింగిల్ విండో చైర్మన్లు నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







