కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్‌ఎస్ శ్రేణులు
ఉద్యమకారులు, వృత్తి సంఘాల నాయకులకు ఆత్మీయ సన్మానం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: పరిపాలనా సౌలభ్యం కోసం మంచిర్యాలను ప్రత్యేక జిల్లాగా తీర్చిదిద్ది పదేళ్లు పూర్తయిన సందర్భంగా
జిల్లా కేంద్రంలో ఆదివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పార్టీ నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్‌ల ఆధ్వర్యంలో స్థానిక ఐబీ చౌరస్తాలో సంబరాలు జరిగాయి. అక్కడ ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ దార్శనికత, నాటి ఎమ్మెల్యే దివాకర్ రావు నిరంతర కృషితోనే మంచిర్యాల జిల్లా సాకారమై, పదేళ్లలో అన్ని రంగాల్లో విశేష పురోగతి సాధించిందని ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులను, వివిధ వృత్తి సంఘాల నాయకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, టీబీజీకేఎస్ నేతలు, బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.







