ఘనంగా ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: ఐక్య పోరాటాల ద్వారానే ముదిరాజుల హక్కుల సాధన సాధ్యమవుతుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శి దబ్బెటి తిరుపతి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాంనగర్ పెద్దమ్మ ఆలయం వద్ద ముదిరాజ్ మహాసభ 12వ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ… ముదిరాజుల అభ్యున్నతి, సాధికారత, రాజకీయ చైతన్యం కోసం రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్, మహాసభ వ్యవస్థాపకులు బండ ప్రకాశ్ ఈ సంఘాన్ని స్థాపించారని గుర్తు చేశారు. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ జాబితాలోకి మార్చాలనే ప్రధాన డిమాండ్‌తో నిరంతర పోరాటం కొనసాగుతోందని, ప్రభుత్వ జాప్యంపై సంఘ పెద్దల నిర్ణయాలకు అనుగుణంగా జాతి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల జనాభా (14 శాతం వాటా) కలిగిన ముదిరాజులకు హక్కులు, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో జనాభా దామాషా ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం సంఘాల సంఖ్యను 3 నుంచి 500కు పెంచడంతో పాటు చేపల వృత్తికి అవసరమైన పనిముట్లు, వలలు, 62,500 ద్విచక్ర వాహనాలు, 4 వేల మూడు చక్రాల వాహనాలు, వందలాది వ్యాన్లను అందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు గరిగె సుమన్, నాయకులు గరిగంటి సరోజ, తూటి రమేష్, నూనె రాజేశం, పంబల పోషం, మంద రమేష్, కొలిపాక తిరుపతి, ఐలవేని కన్నయ్య, చుక్క మల్లేష్, షెనవెన పోషం, రాక్వార్ రాజు తదితరులు పాల్గొన్నారు.







