- రూ. 925 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ.. ఆర్నెల్లలో సింగరేణి స్థలాలకు పట్టాలు
- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు
- 7వ డివిజన్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు విద్యా, వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా, ఇతర ప్రాంతాల వారే మంచిర్యాల వైపు చూసేలా నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలపడానికి యజ్ఞంలా పనిచేస్తున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ వేల్పుల రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మేయర్ ధర్ని మధుకర్, కమిషనర్ జి. అన్వేష్‌లతో కలిసి ఆయన ప్రారంభించి లబ్ధిదారులకు బీమా ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు మాట్లాడుతూ.. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో బీమా నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రూ. 7.20 లక్షల కోట్ల అప్పులు చేసిందని, అయినప్పటికీ తమ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తోందని తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ. 925 కోట్ల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు కృషి చేసిన కమిషనర్ అన్వేష్‌ను అభినందించారు. నస్పూర్ ప్రాంతంలో రూ. 6 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పట్టణ నడిబొడ్డున మాతా శిశు ఆసుపత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 4,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్వోసీలు అందించామన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లో విద్యాశాఖలో మౌలిక వసతుల కోసం రూ. 45 కోట్లు మంజూరు చేయించామని, ఇటీవల కార్పొరేషన్ పరిధిలో మంజూరైన 2,415 చేయూత పింఛన్ల డబ్బులు ఈ నెల 26న లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. సింగరేణి కార్మికుల మారుపేర్లు, డిస్మిస్ కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, రిటైర్డ్ కార్మికులకు నెహ్రూ కాలనీల పేరిట స్థలాలు, కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ మెడికల్ బోర్డు ద్వారా అర్హులైన ఉద్యోగులను అన్‌ఫిట్ చేయడంతో పాటు ఈ ఏడాది చివరిలోగా మెడికల్ ఫిట్ అయినా డిపెండెంట్లకు కారుణ్య నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న వారికి ఆరు నెలల్లోగా యాజమాన్య హక్కులతో కూడిన పట్టాలు ఇప్పిస్తామని ప్రకటించారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు తన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నందున రాబోయే ఎన్నికల్లోనూ మంచిర్యాలలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ సి. రాజు, కార్పొరేటర్లు గుమ్మడి శ్రీనివాస్, తోటపల్లి రాజేశ్వరి, వనపర్తి గీత, కోండ్ర రాజేశ్వరి, ప్రకృతి, మేకల రాము, బండారి సుధాకర్, తాళ్ల సంపత్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.









