సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండల కేంద్రంలో రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన మహిళా మత్స్యకారుల భవనాన్ని (మహిళల జీవనోపాధి – ఆర్థిక సాధికారత కేంద్రం) ను శుక్రవారం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ
సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకార మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళలకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, మత్స్యకారుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ భవన నిర్మాణం ద్వారా మహిళా మత్స్యకారులకు శిక్షణ, సమావేశాలు మత్స్య ఉత్పత్తుల నిల్వకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, సర్పంచ్ అంపోలి వనజా కృష్ణ ప్రసాద్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మత్స్యకార సంఘం నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
KYATHAM RAJESH
శ్రీరాంపూర్ పాఠశాలలో నూతన కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య ఎంతో అవసరమని, చిన్నతనం నుంచే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. శ్రీరాంపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆధునిక సాంకేతిక సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భాగంగా మేయర్ చేతుల మీదుగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటగా, విద్యార్థులకు ఉచితంగా షూలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుందని, ఇది విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేల్పుల రవీందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంస్థ లాభాలు వెంటనే ప్రకటించాలి
సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్: గత ఆర్థిక సంవత్సరం పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు సంస్థ లాభాలు ప్రకటించకపోవడం సరికాదని, తక్షణమే లాభాలను వెల్లడించి కంపెనీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం శ్రీరాంపూర్లోని యూనియన్ కార్యాలయంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయనతో పాటు ఉప ప్రధాన కార్యదర్శి రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సంస్థ అభివృద్ధి పేరిట సుమారు రూ. 6,000 కోట్లు పక్కన పెట్టిన యాజమాన్యం, ఆ నిధులతో ఎంతమేర అభివృద్ధి పనులు చేపట్టిందో స్పష్టం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులకు నాణ్యమైన బూట్లు, బిట్లు, డ్రిల్ రాడ్లు, హాలేజ్ రోప్లు, రెయిన్ కోట్లు, సెక్యూరిటీ సిబ్బందికి యూనిఫాం వంటి రక్షణ పరికరాలను సమయానికి అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల వేతనాల నుంచి రికవరీ చేసిన సీఎంపీఎఫ్ సొమ్మును ఖాతాల్లో జమ చేస్తున్నప్పటికీ, వివరాలు అప్డేట్ చేయకపోవడం సీఎంపీఎఫ్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, దీనిపై సింగరేణి అధికారులు బాధ్యత తీసుకుని కార్మికులకు పే-స్లిప్పులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు వెంగల శ్రీనివాస్, సాయిళ్ల శ్రీనివాస్, తోడే సుధాకర్, మీడివెల్లి శ్రీనివాస్, వెంకట రెడ్డి, పేరుక సదానందం, సిరికొండ శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
- మదర్స్ ప్రైడ్ స్కూల్ లో వైభవంగా పోశమ్మ బోనాల ఉత్సవాలు
- శోభాయాత్రగా తరలివెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించిన విద్యార్థులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని మదర్స్ ప్రైడ్ స్కూల్ ప్రిన్సిపాల్ దండ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నస్పూర్ పట్టణంలోని మదర్స్ ప్రైడ్ పాఠశాలలో బుధవారం పోశమ్మ బోనాల పండుగను
ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బోనం పోసి, పోతురాజులు, అమ్మవార్ల వేషధారణలతో అలరించారు. అనంతరం విద్యార్థులు మంగళ వాయిద్యాల నడుమ బోనాలు నెత్తినెత్తుకుని ఊరేగింపుగా పోశమ్మ దేవాలయానికి తరలివెళ్లి గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ దండ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ రేగళ్ల ఉపేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బోనాల పండుగ విశిష్టతను, గ్రామ దేవతల ప్రాముఖ్యతను, బోనం సమర్పించే సంప్రదాయాన్ని వివరించారు. పూజా కార్యక్రమాల అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వదీప్తి, సంధ్య, రజిత, సరిత, సుమలత, శ్రీవాణి, రాజేశ్వరి, పద్మ, స్రవంతి, షానాజ్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
- ఈనెల 13న హైదరాబాద్లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని పిలుపు
- ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ జేఏసీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై ఈ నెల 13న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన భవన్లో జరిగే రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని నాయకులు విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ఏటా రూ. 12 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటో భవన్ నిర్మాణంతో పాటు రూ. 1000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. మహాలక్ష్మి పథకం ప్రభావంతో ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గి ఫైనాన్స్ కిస్తీలు, ఇంటి అద్దెలు చెల్లించలేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న 200 పైచిలుకు ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. కొత్త త్రీ వీలర్ లైసెన్సుల జారీ నిలుపుదల చేయడం, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టాలనే ఆలోచనను విరమించుకోవాలని నాయకులు స్పష్టం చేశారు. ఆర్టీసీలో అద్దె బస్సుల మాదిరిగానే అద్దె ఆటోలకు అవకాశం కల్పించి ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఈ నెల 17న జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జేఏసీ నాయకులు పొట్ట మధుకర్, చెల్ల విక్రమ్, సుద్దాల రాజు, కట్ట రామ్ కుమార్, తగరం శ్రీనివాస్, ఎండీ హబీబ్ తదితరులు పాల్గొన్నారు.
- కుటుంబసమేతంగా తరలివచ్చిన పర్యాటకులు
- మౌలిక వసతులు కల్పించాలని సందర్శకుల విజ్ఞప్తి
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న గత్రపల్లె జలపాతానికి సోమవారం పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరద నీటితో పాల నురగలా జాలువారుతున్న జలపాతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పాఠశాలలకు వరుసగా సెలవులు రావడంతో పలువురు కుటుంబ సభ్యులతో కలిసి జలపాతాన్ని సందర్శించి ప్రవాహాన్ని చూసి పరవశించిపోయారు. యువత, చిన్నారులు జలపాతం వద్ద స్నానాలు చేస్తూ ప్రకృతి రమణీయతను ఆస్వాదించారు. పలువురు బంధుమిత్రులతో కలిసి సమీపంలో సహపంక్తి భోజనాలు చేసి, ఆటపాటలతో సరదాగా గడిపారు. జలధారలను కెమెరాల్లో బంధిస్తూ సెల్ఫీలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. కాగా, గత్రపల్లె జలపాతానికి వెళ్లడానికి సరైన రహదారి లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జలపాతానికి వెళ్లే మార్గాన్ని నిర్మించడంతో పాటు అక్కడ తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించి మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సందర్శకులు కోరుతున్నారు.
- మాజీ డీసీసీ అధ్యక్షురాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన కొక్కిరాల సురేఖ
- ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్లో శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తి, సంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ జాతరలో శివ సత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ఆదిపరాశక్తి అమ్మవారి దివ్య ఆశీస్సులు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖశాంతులతో, సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, నస్పూర్ పట్టణ ఇంఛార్జి నూకల రమేష్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

- షిర్కే సెంటర్లో ప్రజా పోరు యాత్ర ప్రారంభం
- సెప్టెంబర్ 1న చలో ఢిల్లీని జయప్రదం చేయాలని పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ వ్యాపారుల అభివృద్ధినే దేశ అభివృద్ధిగా చూస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు విమర్శించారు. నిరసిస్తూ సీపీఐ చేపట్టిన ప్రజా పోరు యాత్ర మూడో రోజు కార్యక్రమాన్ని ఆదివారం నస్పూర్ పట్టణంలోని షిర్కే సెంటర్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ఈ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు ఎందుకు పెంచడం లేదో బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని మేకల దాసు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ధరలను నియంత్రించడంలో, పేద విద్యార్థులకు విద్యను అందించడంలో, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో వైఫల్యం చెంది అబద్ధపు ప్రచారాలతో కాలాన్ని వెళ్లదీస్తోందని ఆరోపించారు. దేశంలో పేద ప్రజల సామాజిక, నైతిక అభివృద్ధే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. విద్య, వైద్యం ప్రతి పేదవాడికి అందుబాటులోకి రావాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచడం ద్వారా మాత్రమే ఉపాధి భద్రత, దేశాభివృద్ధి సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రేగుంట చంద్రశేఖర్, కారుకూరి నగేష్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు, ఎస్కే బాజీ సైదా, కొట్టే కిషన్ రావు, మోత్కూరు కొమురయ్య, గునిగంటి నర్సింగరావు, సురేష్, చిలుక రామచందర్ పాల్గొన్నారు.
- సిఈఆర్ క్లబ్లో అంబేద్కర్ జీవితాధారిత నాటిక ప్రదర్శన
- ఆదివారం సత్యశోధన నాటకాన్ని వీక్షించాలని నిర్వాహకుల పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితంపై ప్రదర్శించిన సంఘం శరణం గచ్ఛామి నాటకం ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నస్పూర్ సీఈఆర్ క్లబ్ ప్రాంగణంలోని గోదావరి ఫంక్షన్ హాల్లో ఈ నాటికను ప్రదర్శించారు. సింగరేణి యాజమాన్యం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. ఈ నాటకాన్ని వీక్షించేందుకు సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంబేద్కర్ జీవిత విశేషాలను నేటి తరానికి కళ్లకు కట్టేలా ఎంతో ఆసక్తిగా ఈ నాటికలో ప్రదర్శించారని వీక్షకులు అభిప్రాయపడ్డారు. కాగా, ఆదివారం సాయంత్రం ఇదే ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా పూలే జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న సత్యశోధన నాటకాన్ని ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నాటక ప్రదర్శనకు సైతం ప్రజలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ప్రతినిధులు బాజీ సైదా, ముస్కే సమ్మయ్య, మోతుకూరి కొమురయ్య, ఎస్ ఓ టూ జీఎం కృష్ణ ప్రసాద్, ఏజీఎం సుమలత, డీజీఎంలు అనిల్ కుమార్, ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, స్థానికులు, చిన్నారులు హాజరయ్యారు.
- ఎస్ఆర్ఆర్ హై స్కూల్లో ఘనంగా బోనాల వేడుకలు
- అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని ఎస్ఆర్ఆర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ రేగళ్ల ఉపేందర్ పేర్కొన్నారు. నస్పూర్ పట్టణంలోని ఏఎస్ఆర్ఆర్ నగర్లోని ఎస్ఆర్ఆర్ హై స్కూల్లో తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు బోనం పోసి, పోతురాజులు, అమ్మవార్ల వేషధారణలతో అలరించారు. అనంతరం ప్రిన్సిపాల్ ఉపేందర్ మాట్లాడుతూ బోనాల పండుగ విశిష్టతను, గ్రామీణ దేవతల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. బోనం సమర్పించడం వెనుక ఉన్న సంప్రదాయ విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యనారాయణ, సుష్మా, పద్మ, భారతి, సత్యవతి, రాధ, మనోజ, తిరుపతమ్మ, హీనా, మౌనిక, భాగ్యలక్ష్మి, మహేష్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.



