సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండలంలోని న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కుందారం పోశెట్టి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, శనివారం ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట బన్సపల్లిపిఎసిఎస్ చైర్మన్ రమణారెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ డైరెక్టర్ తోట సాయన్న, సిద్దులకుంట సర్పంచ్ సతీష్ రెడ్డి, కేశెట్టి మల్లయ్య, కుస్తాపురం రాజలింగు, మూడపల్లి చిన్నయ్య, నర్సింగరావు, కేశెట్టి ఆశన్న, పోతుగంటి రాజేందర్, అలాగే బొప్పారం, పాకపట్ల గ్రామాల మాజీ సర్పంచులు వెంకయిగారి శ్రీనివాస్ రెడ్డి, ఏల్చల గంగారెడ్డి తదితరులు ఉన్నారు.
KYATHAM RAJESH
- రూ. 109 కోట్ల రుణం వడ్డీతో సహా చెల్లించా
- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెల్లడి
- ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా పునర్నిర్మాణ వీడియోల ప్రదర్శన
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి, మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయాల ఆధునీకరణ పనులు వచ్చే శ్రావణమాసంలోగా ప్రారంభమవుతాయని మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్
సాగర్ రావు తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని నార్త్ ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయాల పునర్నిర్మాణ నమూనా వీడియోలను ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. రూ. 98 కోట్లతో గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్ల నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి శ్రావణమాసంలోగా పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. వచ్చే పుష్కరాల నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. రెండవ అన్నవరంగా పేరుగాంచిన గూడెం ఆలయాన్ని ఆగమశాస్త్ర ప్రకారం అభివృద్ధి చేయడంతో పాటు ఒకేసారి వెయ్యి జంటలు వ్రతాలు చేసుకునేలా మండపాలను, భక్తులకు వసతులు, బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అలాగే విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
అప్పుల చెల్లింపు విషయంలో విపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రూ. 450 కోట్ల రుణానికి ఆమోదం లభించగా రూ. 109 కోట్ల రుణం మాత్రమే తీసుకుని వడ్డీతో సహా చెల్లించానని స్పష్టం చేశారు. పొలిటికల్ జీవితంలోకి రాకముందే వ్యాపారంలో ఎదుగుదల సాధించానని తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్లు రామగిరి బానేష్, అక్కల వెంకటేశ్వర్లు, నాయకులు నలిమెల రాజు, సయ్యద్ షాహిద్ అలీ, పూదరి తిరుపతి, మంగిలాల్, ఇతర కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
- అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేస్తాం: నరెడ్ల శ్రీనివాస్
- హెచ్ఎంఎస్ మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎండి హుస్సేన్ నియామకం
నస్పూర్, ఆర్.కె న్యూస్: కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాల కల్పన, ఉద్యోగ భద్రత కోసం హెచ్ఎంఎస్ నిరంతరం పోరాటం చేస్తూ అండగా నిలుస్తుందని ఆ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పేరుతో కార్మికులను దోపిడీ చేస్తూ తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రాథమిక హక్కులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టాలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని శ్రీనివాస్ విమర్శించారు. అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఆర్టీసీ, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది, 108, 104 ఉద్యోగులు, ప్రైవేట్ హాస్పిటల్ కార్మికులు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, రవాణా, భవన నిర్మాణ అనుబంధ రంగాల కార్మికులు తక్కువ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, కనీస వేతన చట్టాలను అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో హెచ్ఎంఎస్ను మరింత బలోపేతం చేస్తూ వివిధ రంగాల్లో కమిటీలు ఏర్పాటు చేసి సభ్యత్వాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎండి హుస్సేన్‌ను హెచ్ఎంఎస్ మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. నూతనంగా నియమితులైన హుస్సేన్ మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం, సంఘ విస్తరణ కోసం అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపర్తి సాయి కృష్ణ, ఉపాధ్యక్షుడు ఎండి షఫీ, కార్యదర్శి తగరం శ్రీనివాస్, నాయకులు దున్నపోతుల రమేష్, పి. శ్రీనివాస్, రాజిరెడ్డి, ఎండి అజీమ్, ఏ. మహేష్, చందు, సురేష్, పవన్ పాల్గొన్నారు.
నిర్మల్, ఆర్.కె న్యూస్: నిర్మల్ ఆదర్శనగర్‌లో గల వశిష్ట హైస్కూల్లో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ నిలువుటద్దమని పాఠశాల చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ అనగానే అందరికీ గుర్తువచ్చేది బోనాల పండుగేనని, రాష్ట్రంలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఉత్సవాలు రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ వైభవంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సంబరాలలో భాగంగా విద్యార్థులు పోతురాజులు, అమ్మవార్ల వేషధారణలతో అలరించి తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు. ముందుగా దుర్గామాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి బోనాలు సమర్పించి, ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జి. మాధవి, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
సోన్, ఆర్.కె న్యూస్: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గురువారం ఎంపీపీఎస్ సిద్దులకుంట పాఠశాలలో బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బ్యాండ్ మేళాలు, పోతురాజుల నృత్యాలతో గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. విద్యార్థినుల బోనాల ఊరేగింపు, పోతురాజుల వేషధారణతో విద్యార్థులు చేసిన విన్యాసాలు గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామస్థులు వారి ప్రదర్శనను తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాటికొండ రాజేశ్వర్, ఉపాధ్యాయులు పి. నర్సారెడ్డి, గృశాలి, విందు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారులకు నోటీసులు అందజేత
సోన్, ఆర్.కె న్యూస్: “ప్లాస్టిక్‌ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అని ఎంపీఓ జడి జ్యోతి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని న్యూ వెల్మల్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. గ్రామంలోని వ్యాపార, దుకాణ సముదాయాల వద్దకు వెళ్లి, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే నష్టాలపై దుకాణదారులకు అవగాహన కల్పించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను విక్రయించవద్దని హెచ్చరించారు. దుకాణాల వద్ద పరిశుభ్రత పాటించాలని, లేనిపక్షంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం చర్యలు తీసుకుని జరిమానా విధిస్తామని తెలిపారు. అనంతరం దుకాణ యజమానులకు నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భూపాల్ రెడ్డి, కారోబార్ ప్రవీణ్, జిలకర వేణు, భాస్కర్, భోజన్న, ధోని భీమేష్, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
- ఒడిశా నుంచి తెలంగాణకు చేరిన తొలి రైల్వే రేకు
- సింగరేణి విస్తరణకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం: భట్టి విక్రమార్క
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ఒడిశా రాష్ట్రంలోని నైనీ గని నుంచి లోడ్ చేసిన తొలి బొగ్గు రైల్వే రేకు సుమారు 1,131 కిలోమీటర్లు ప్రయాణించి మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (ఎస్టీపీపీ) గురువారం ఉదయం చేరుకుంది. ఇతర రాష్ట్రంలోని సంస్థ గని నుంచి తెలంగాణకు బొగ్గు సరఫరా కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. హిందోల్ రైల్వే సైడింగ్లో లోడ్ చేసిన 59 వేగన్ల ద్వారా సుమారు 4,000 టన్నుల జి-10 గ్రేడ్ బొగ్గు చేరింది. విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు వీడియో సందేశం ద్వారా కార్మికులకు, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని, సింగరేణి పటిష్టతకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. ఇటీవల తాడిచెర్ల-2, మణుగూరు డిప్‌సైడ్ బ్లాకులను సాధించామని, క్రిటికల్, రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలోనూ అడుగుపెట్టి సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతామన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న తొలి రైల్వే రేకుకు డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, ఎం. తిరుమలరావు ఘన స్వాగతం పలికి, అన్లోడింగ్ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ అవసరాలకు పెద్దపీట వేస్తున్నామని, ప్రస్తుతం మరో 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ యూనిట్ నిర్మాణంలో ఉందని వారు తెలిపారు. ప్రశాంతంగా సాగిన ఈ రవాణాకు సహకరించిన తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు, రైల్వేలకు సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడి చిరంజీవి, జీఎం నరసింహ రావు, జీఎం సూర్యనారాయణ రాజు, గుర్తింపు కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రం, కనీస వేతనాల అమలు కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్, అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- నస్పూర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న
- జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నస్పూర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన చూపిన బాటలోనే ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జయశంకర్ ఆలోచనలు, సేవలు తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కే. సురేందర్ రెడ్డి, నాయకులు బండి రమేష్, రమేష్, అహ్మద్, పూధరి కుమార్, రుకుం తిరుమల్, పానుగంటి సత్తయ్య, ఆకునూరి సంపత్, భానుచందర్, రఫీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు పొందిన డాక్టర్ వి. నరేందర్ రెడ్డికి ఘన సన్మానం
అల్ఫోర్స్ అధినేత సేవలు స్ఫూర్తిదాయకం: ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెతుల రాజేంద్ర పాణి
నస్పూర్, ఆర్.కె న్యూస్: విద్యారంగంలో విశేష సేవలు అందిస్తూ ప్రతిష్టాత్మక ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించిన ప్రముఖ విద్యావేత్త, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి. నరేందర్ రెడ్డిని ట్రస్మా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కరీంనగర్‌లోని ఆయన కార్యాలయంలో బుధవారం ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెతుల రాజేంద్ర పాణి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ట్రస్మా ప్రతినిధులు నరేందర్ రెడ్డిని కలిసి శాలువా కప్పి, సత్కరించారు. ఈ సందర్భంగా రాజేంద్ర పాణి మాట్లాడుతూ.. డాక్టర్ నరేందర్ రెడ్డి విద్యార్థుల అభ్యున్నతి కోసం అహర్నిశలు చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన ప్రవేశపెడుతున్న వినూత్న విద్యా విధానాలు ఇతర విద్యాసంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలో లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం విద్యా రంగానికే గర్వకారణమని హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పురస్కారాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కే. శ్యాంసుందర్ రెడ్డి, కోశాధికారి కృష్ణారెడ్డి, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ రేగళ్ల ఉపేందర్, ట్రస్మా ప్రతినిధులు శ్రీధర్ రెడ్డి, ఖాజా కమ్రోద్దీన్, కే. జగన్మోహన్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, జుల్ఫికర్, పాషా, అంబాల రాజ్‌కుమార్, అమన్ తదితరులు పాల్గొన్నారు.
- పుస్తకాలను చదివించడం ద్వారా పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది
- నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సోన్, ఆర్.కె న్యూస్: చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం సోన్ మండల కేంద్రంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ఎంపిపియస్ పాఠశాలను తనిఖీ చేసి పాఠశాలకు సంబంధించిన వివరాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య, మధ్యాహ్న భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులంతా క్రమం తప్పకుండా బడికి వచ్చే విధంగా చూడాలన్నారు. విద్యార్థులతో ఇంగ్లీషు కథలు చదివిపించి, ప్రశ్నలు అడిగి వారి నుంచి జవాబులు రాబట్టారు. సమాధానాలు చెప్పిన విద్యార్థులను అభినందించి, వారికి పెన్నులు బహుమతులుగా ఇచ్చారు.కలెక్టర్ మాట్లాడుతూ, పుస్తకాలను చదివించడం ద్వారా భాషా జ్ఞానం, సబ్జెక్టుపై నైపుణ్యం పెరుగుతుందన్నారు.అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన వివరాలన్నీ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు, ప్రతి రోజు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఇప్పటివరకు పూర్తయిన సిలబస్ అడిగారు. జవాబులు చెప్పిన విద్యార్థులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. వారికి పెన్నులు బహుమతులుగా అందించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ సంతోష్, ఎంపీవో జ్యోతి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.



