శ్రీరాంపూర్‌లో విజిలెన్స్ అవగాహన సదస్సు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి రహిత, పారదర్శక పాలన కొనసాగినప్పుడే ఆయా సంస్థలు అభివృద్ధి పథంలో ముందంజలో ఉంటాయని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు – 2026లో భాగంగా, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఆదేశాల మేరకు శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని సీసీసీ సింగరేణి గెస్ట్ హౌస్‌లో అవినీతి నిర్మూలనపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల అధికారులకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ… సింగరేణిలో అవినీతి రహిత వాతావరణాన్ని నెలకొల్పేందుకు సంస్థ స్వతంత్ర విజిలెన్స్ విభాగాన్ని పటిష్టంగా నడుపుతోందని తెలిపారు. అక్రమాలు, అవకతవకలపై ఎవరైనా నిర్భయంగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించామని, తద్వారా పారదర్శక సేవలు అందరికీ సమానంగా అందుతాయని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్, ఎన్ఎల్‌పీ ప్రాక్టీషనర్ కిషోర్ హాజరై అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమగ్ర అవగాహన కల్పించారు. లంచగొండితనం, అవినీతి కార్యకలాపాలు వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేస్తాయో, వాటిని అరికట్టేందుకు సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలను సవివరంగా వివరించారు. నిబద్ధత, పారదర్శకతతో పనిచేసినప్పుడే సంస్థలకు సమాజంలో మంచి గుర్తింపు, విశ్వసనీయత లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని వివిధ విభాగాల అధిపతులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.







