- మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్
- 28వ డివిజన్‌లో 99 రోజుల ప్రగతి ప్రణాళిక పారిశుధ్య పనుల పరిశీలన
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఇళ్ల నుంచి వచ్చే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పారబోయకుండా మున్సిపల్ సిబ్బందికి మాత్రమే అందజేసి పారిశుధ్య నిర్వహణలో సహకరించాలని మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్‌లో గురువారం
ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించారు. మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య ఈ కార్యక్రమానికి హాజరై డివిజన్ వ్యాప్తంగా చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో చర్చించి తగిన సూచనలు చేశారు. మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి డివిజన్ అంతటా పర్యటించిన మేయర్ బృందం స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిసరాల పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రణాళికాబద్ధమైన ఈ పారిశుధ్య పనుల ద్వారా నగరాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మేయర్ వివరించారు. ప్రజల సహకారంతోనే పట్టణ సుందరీకరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ అమృత రాజ్ కుమార్, 27వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య, వార్డు ఆఫీసర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








