- జైపూర్ ఏసీపీ ఏ. వెంకటేశ్వర్
- శ్రీరాంపూర్‌లో అరైవ్ – అలైవ్ హెల్మెట్ అవగాహన భారీ ర్యాలీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జైపూర్ ఏసీపీ ఏ. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. రహదారి భద్రత, ప్రమాదాల నివారణలో భాగంగా చేపట్టిన అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ నుంచి సింగరేణి
జీఎం కార్యాలయం వరకు పోలీసులు, కార్మికులు, స్థానిక ప్రజలతో కలిసి ఈ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జైపూర్ ఏసీపీ మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని, నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది విధిగా హెల్మెట్ ధరించాలని, నో హెల్మెట్ – నో ఎంట్రీ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులతో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదకరమని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, సింగరేణి కార్మికులు, ప్రజల భద్రతను పరిరక్షించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ ఆకుల అశోక్, జైపూర్ సిఐ నవీన్ కుమార్, ఎస్సైలు రాజశేఖర్, మేకల సంతోష్, లక్ష్మీ ప్రసన్న, పోలీస్ సిబ్బంది, సింగరేణి కార్మికులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








