⚫ డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్
⚫ అవగాహన పోస్టర్లు, కరపత్రాలను విడుదల
నస్పూర్, ఆర్.కె న్యూస్: చిన్నారులలో సంభవించే మరణాలకు ప్రధాన కారణమవుతున్న నిమోనియాను ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స అందించడం, నవజాత శిశువులకు సరైన సంరక్షణ కల్పించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చు” అని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉప జిల్లా వైద్యాధికారులు డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అనిల్ కుమార్‌లతో కలిసి నిమోనియా అవగాహన, నవజాత శిశు సంరక్షణ వారోత్సవాల పోస్టర్లు, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రపంచ నిమోనియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, ఉప కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల నిమోనియా సోకుతుందని తెలిపారు. పిల్లల్లో తీవ్ర జ్వరం, దగ్గు, వేగంగా శ్వాస తీసుకోవడం, ఛాతీ లోనికి వెళ్లడం, పాలు తాగలేకపోవడం, పెదవులు నీలంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే ఇంటి వద్దే వైద్యం చేయకుండా తక్షణమే ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు నవజాత శిశు సంరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిశువు పుట్టిన గంటలోపు ముర్రుపాలు, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని, కంగారు కేర్ ద్వారా వెచ్చదనం కల్పించడం, సకాలంలో టీకాలు వేయించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంపై ఆశా కార్యకర్తలు గ్రామాల్లో తల్లులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, రషీద్, సీహెచ్‌వోలు కాకిరాల వెంకటేశ్వర్లు, నామ్‌దేవ్, శ్రీనివాస్, సుమన్, సురేందర్, ఆర్.ఎస్. పద్మ, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.







