100 శాతం ఉత్పత్తి లక్ష్యం సాధించాలి: శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేసి ఆర్.కె 5 గనికి పూర్వవైభవం తీసుకురావాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఆర్.కె 5 గనిని సందర్శించి అధికారులతో కలిసి భూగర్భంలోని పని ప్రదేశాలను పరిశీలించారు. 5వ సీమ్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్‌లో బొగ్గు ఉత్పత్తి తీరుతెన్నులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధన కోసం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అంతకుముందు మేనేజర్ కార్యాలయంలో ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో గని నిర్వహణ, రక్షణ, భద్రతా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 95 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన కొద్ది రోజుల్లో నూటికి నూరు శాతం వార్షిక ఉత్పత్తి సాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు. 5వ సీమ్ నార్త్ సైడ్ లో మరింత బొగ్గు వెలికితీసే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తించారు. దీనివల్ల గని జీవితకాలం మరో రెండు లేదా మూడేళ్లు పెరిగే వీలుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ ఎన్. శ్రీధర్, గ్రూప్ ఇంజనీర్ భట్టాచార్య, గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝా, రక్షణ అధికారి శివయ్య, ఇంజనీర్ శ్యామ్ కుమార్, సర్వేయర్ ఏ. సంపత్ హాజరయ్యారు. పలువురు మైనింగ్ సిబ్బంది, సూపర్వైజర్లు పాల్గొన్నారు.







