- స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి
- మంచిర్యాలలో వరంగల్ జోన్-2 ఇన్ఛార్జ్ వరికిల్ల మల్లేష్ పిలుపు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, పెరియార్, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరాం వంటి మహనీయుల స్ఫూర్తి, ఆశయ సాధనే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రధాన లక్ష్యమని బీఎస్పీ వరంగల్ జోన్-2 ఇన్ఛార్జ్ వరికిల్ల మల్లేష్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు బీఎస్పీ జెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆస్పిరెంట్స్ అకాడమీలో బీఎస్పీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వరికిల్ల మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వరికిల్ల మల్లేష్ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు, సెక్టార్ కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో పార్టీ బలోపేతమే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. మహనీయుల పోరాట స్ఫూర్తితో నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉండాలని, స్థానిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే సమాయత్తం కావాలని సూచించారు. కాగా, చెన్నూర్ నియోజకవర్గ నూతన ఇన్‌ఛార్జ్‌గా దుర్గం గంగారాంను ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్ శెట్టి ప్రవళిక, మంచిర్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెట్టం చంద్రశేఖర్, నియోజకవర్గ అధ్యక్షుడు బండారి రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సిరివేని రాజేష్, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు దాగం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కుంటాల శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు శెట్టి శంకరయ్య, జాగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.







