అదనపు పనికి ఓటీ ఇవ్వాలని, వేధింపులకు పాల్పడుతున్న నాయకుడిపై చర్యలు తీసుకోవాలి
టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ సీహెచ్‌పీ కార్మికులు ఎదుర్కొంటున్న తాగునీరు, అదనపు పని వేతనాల సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సీహెచ్‌పీ వద్ద టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించగా, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చారు. ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయక శుద్ధమైన తాగునీరు అందడం లేదని, వ్యాగన్ లోడింగ్ విభాగంలో 8 గంటల డ్యూటీకి మించి షిఫ్టుల మధ్య అదనంగా పని చేయిస్తున్నా ఓటీ వేతనం ఇవ్వడం లేదని వాపోయారు. అలాగే గుర్తింపు యూనియన్‌కు చెందిన ఓ నాయకుడు యాజమాన్యానికి తొత్తుగా మారి, కార్మికులపై విజిలెన్స్‌కు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాడని తెలిపారు. దీనిపై కేతిరెడ్డి స్పందిస్తూ.. సదరు నాయకుడిపై గుర్తింపు సంఘం అగ్రనాయకత్వం విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు ఈ సమస్యలన్నింటినీ సీహెచ్‌పీ డీవైజీఎం చంద్రలింగం దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ నాయకులు నీలం సదయ్య, బ్రాంచ్ సెక్రటరీలు బుస్సా రమేష్, రామిడి మహేందర్ రెడ్డి, నాయకులు కొలిపాక సమ్మయ్య, లక్ష్మణ్, జంగం రమేష్, శ్రీనివాస్, నూనె శ్రీనివాస్, గండి సమ్మయ్య, మహిళా నాయకురాలు సుమలత, ఉద్యోగులు పాల్గొన్నారు.







