24 డిమాండ్ల సర్క్యులర్లు విడుదల చేయకపోవడంపై వాసిరెడ్డి సీతారామయ్య, కోరిమి రాజ్‌కుమార్ ధ్వజం
శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట రెండో రోజు కొనసాగిన ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, యాజమాన్యం ఇకపై మాటలు, హామీలతో కాలయాపన చేస్తే సహించేది లేదని, గడువుతో కూడిన కార్యాచరణ ప్రకటించకపోతే జెన్‌కో, ట్రాన్స్‌కోలకు బొగ్గు సరఫరా నిలిచిపోయే స్థాయిలో భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కోరిమి రాజ్‌కుమార్ హెచ్చరించారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండో రోజు కూడా ఉధృతంగా కొనసాగాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆర్‌ఎల్‌సీ వేదికగా అంగీకరించిన 24 డిమాండ్లకు తక్షణమే అధికారిక సర్క్యులర్లు విడుదల చేయాలని, సుమారు రూ. 60 వేల కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 210 మంది డిపెండెంట్ అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని, మెడికల్ బోర్డులకు హాజరైన కార్మికులందరికీ అన్‌ఫిట్ ప్రక్రియ చేపట్టాలని కోరారు. పెర్క్స్‌పై పన్ను సమస్య పరిష్కారం, సొంత ఇంటి పథకం అమలు, మైనింగ్ స్టాఫ్ ప్రమోషన్లతో పాటు గనుల్లో రక్షణ పరికరాలు, యంత్రాల స్పేర్ పార్ట్స్ కొనుగోలులో జాప్యాన్ని నివారించాలన్నారు. సింగరేణి స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ రాజకీయ జోక్యాలకు స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. అనంతరం జీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ సెక్రెటరీ ఎస్‌కే బాజీ సైదా, వైస్ ప్రెసిడెంట్లు కొట్టే కిషన్ రావు, తౌటం మల్లేష్, నాయకులు అక్కపాక సంపత్, అఫ్రోజ్ ఖాన్, రాజ్‌కుమార్, మారేపల్లి సారయ్య, గుడిగంటి నర్సింగరావు, వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.







