నస్పూర్, ఆర్.కె న్యూస్: బీఎంఎస్ రాష్ట్ర ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన చెల్ల విక్రమ్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని బీఎంఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో బీఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంచిర్యాల కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముకేశ్ గౌడ్, బీఎంఎస్ ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంతరం పెంటయ్యల చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. మంచిర్యాల జిల్లా బీఎంఎస్ అధ్యక్షుడిగా ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి విక్రమ్ చేసిన నిరంతర సేవలను గుర్తించి రాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా చెల్ల విక్రమ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందని, ఆటో డ్రైవర్లు, కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు ఎల్లవేళలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
KYATHAM RAJESH
మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్
సీతారాంపల్లి జడ్పీ హైస్కూల్లో అల్పాహార పంపిణీ ప్రారంభం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావం చూపుతుందని మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ సీతారాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేపట్టిన ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఎంతో అభినందనీయమని తెలిపారు. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ప్రత్యేక చొరవ ఫలితంగా నియోజకవర్గంలో రాష్ట్రంలోనే నాలుగో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు కావడం హర్షణీయమని మేయర్ వివరించారు. తన స్వగ్రామమైన సీతారాంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైన మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, హరే కృష్ణ ఫౌండేషన్‌కు, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిష్టయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ధర్ని మల్లేష్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొక్కిరాల మోహన్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ అల్లూరి సీతారామరాజు నగర్, రాంనగర్ ప్రజల రాకపోకల సౌకర్యార్థం చేపట్టిన కనెక్టివిటీ బ్రిడ్జి నిర్మాణ పనులను కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ స్థానికులతో కలిసి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 32వ డివిజన్ ప్రజల చిరకాల స్వప్నమైన ఈ కనెక్టివిటీ బ్రిడ్జి నిర్మాణం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ప్రత్యేక చొరవతోనే సాకారమవుతోందని స్పష్టం చేశారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే రెండు ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం లభించి, రాకపోకలు మరింత సులభతరం అవుతాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ, మంచిర్యాల పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సొంతింటి కలను నిజం చేస్తోందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్లో నూతనంగా నిర్మించుకున్న లబ్ధిదారులు గుండా లక్ష్మి, రాయనర్సు దంపతుల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో పేదల గృహ నిర్మాణాలకు పూర్తి సహకారం అందుతోందని తెలిపారు. తమ సొంతింటి నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు, మేయర్ దర్ని మధుకర్‌కు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించి, వేద పండితులతో ఆశీర్వచనాలు ఇప్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రె శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోడూరి విజయ్, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
నూతన బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించిన సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి
నస్పూర్, ఆర్.కె న్యూస్: స్వయం ఉపాధి ద్వారా మహిళలు సొంత కాళ్లపై నిలబడి తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని శ్రీరాంపూర్ ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి పేర్కొన్నారు. సింగరేణి సేవా సమితిలో శిక్షణ పొంది, అనంతరం ఫ్యాకల్టీగా సేవలందిస్తున్న కోమటిపల్లి భవాని ఏర్పాటు చేసిన నూతన బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించారు. సేవా సమితి ద్వారా ఏటా వందలాది మంది మహిళలకు బ్యూటీషియన్, టైలరింగ్, మగ్గం వర్క్ వంటి కోర్సుల్లో ఉచిత వృత్తి విద్యా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ నైపుణ్యాలు నేర్చుకున్న వారు సొంతంగా వ్యాపారాలు ప్రారంభిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించడం అభినందనీయమన్నారు. సింగరేణి సంస్థ చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్లో మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిచ్చే శిక్షణలు అత్యంత కీలకమైనవని స్పష్టం చేశారు.

- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: తల్లిదండ్రులు జన్మనిస్తే విద్యాబుద్ధులు నేర్పి బంగారు భవిష్యత్తును ఇచ్చేది ఉపాధ్యాయులే అని
శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ సింగరేణి హైస్కూల్లో శనివారం నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ క్రాంతి కుమార్, ప్రిన్సిపల్ శ్రీనివాస్‌తో పాటు ఉపాధ్యాయులందరినీ శాలువాలతో ఘనంగా సత్కరించారు. గత విద్యాసంవత్సరం పదో తరగతి ఫలితాల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి శ్రీరాంపూర్ పాఠశాల సంస్థకే ఆదర్శంగా నిలిచిందని జీఎం కొనియాడారు. ఉపాధ్యాయుల నిరంతర శ్రమ వల్లే ఈ ఘనత సాధ్యమైందని ప్రశంసిస్తూ, ప్రస్తుత ఏడాది కూడా అదే ఒరవడిని కొనసాగించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియం వేదికగా జరుగుతున్న శ్రీరాంపూర్ ఏరియా ఇంటర్ డిపార్ట్మెంటల్ క్రీడా పోటీల్లో భాగంగా శనివారం రెండో రోజు బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగింది. మొత్తం నాలుగు జట్లు పాల్గొన్న ఈ పోటీలలో క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. మొదటి మ్యాచ్‌లో ఆర్కే-5 గ్రూప్, ఆర్కే-7 గ్రూప్‌లు తలపడగా, ఆర్కే-5 జట్టు విజయం సాధించింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో అదర్స్ గ్రూప్‌పై ఎస్ఆర్పీ గ్రూప్ పైచేయి సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో ఎస్ఆర్పీ గ్రూప్‌పై ఆర్కే-5 జట్టు విజయం సాధించి ఛాంపియన్‌గా నిలవగా, ఎస్ఆర్పీ గ్రూప్ రన్నరప్‌గా నిలిచింది. సింగరేణి వర్క్పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి పాల్ సృజన్ సారథ్యంలో, స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, కోఆర్డినేటర్ తోట సురేష్, జనరల్ కెప్టెన్ సకినాల నర్సయ్య పర్యవేక్షణలో ఈ పోటీలను నిర్వహించారు.
బదిలీపై వెళ్తున్న అధికారులను సత్కరించిన శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలో స్వల్పకాలమే పనిచేసినప్పటికీ తమ హోదాలలో ఎంతో నిబద్ధతతో మెరుగైన సేవలు అందించారని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ కొనియాడారు. ఇటీవల జరిగిన బదిలీల్లో కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ అయిన ఏజీఎం (ఫైనాన్స్) సుమలత, డీజీఎం (ఇంటర్నల్ ఆడిట్) దామోదర్ రావులను శ్రీరాంపూర్ నుంచి రిలీవ్ అవుతున్న సందర్భంగా ఏరియా అధికారుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ఏరియా అభివృద్ధికి తోడ్పడ్డారని ప్రశంసించారు. నూతన బాధ్యతల్లోనూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో ఎస్వో టు జీఎం కృష్ణ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ సురేష్, డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, శ్రీరాంపూర్ ఓసీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సీహెచ్. వెంకటేశ్వర్లు, ఐకే ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ ఏవీ రెడ్డి, డీజీఎంలు హరినారాయణ, రాజన్న, విజయ్ కుమార్, మల్లేష్, కృష్ణారెడ్డి, ఎస్టేట్స్ మేనేజర్ వరలక్ష్మి, పర్చేజ్ ఆఫీసర్ చంద్రశేఖర్, సీహెచ్ పీ ఇన్ఛార్జ్ చంద్రలింగం, సీనియర్ ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ హనుమాన్ గౌడ్ తదితర అధికారులు హాజరయ్యారు.
మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్
ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సమాజంలో ఉపాధ్యాయులకు ఎంతో విలువ ఉందని, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు కుటుంబ పరిస్థితులను, సమాజాన్ని మార్చే శక్తి, దేశ భవిష్యత్తును నిర్మించే శక్తి కేవలం ఒక ఉపాధ్యాయునికే ఉందని మంచిర్యాల
కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ట్రస్మా మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నస్పూర్ పట్టణంలోని ఎంఎం గార్డెన్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు మెడ్‌లైఫ్ ఆసుపత్రిలో వైద్య చికిత్సల్లో రాయితీ కల్పించడం అభినందనీయమని మేయర్ ప్రశంసించారు. డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఇలా ఏ రంగంలో ఉన్నవారినైనా తీర్చిదిద్దే మూలశక్తి గురువేనని మండల విద్యాశాఖ అధికారి చౌదరి తెలిపారు. కొవ్వొత్తిలా కరిగిపోతూ సమాజానికి వెలుగులు పంచుతూ నవ సమాజాన్ని నిర్మిస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను ఏటా గుర్తించి సత్కరిస్తున్నామని ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం మంచిర్యాల మెడ్‌లైఫ్ ఆసుపత్రితో సమన్వయం చేసుకుని వైద్య సేవలపై రాయితీ కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడ్‌లైఫ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, 27వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి-లింగయ్య, ట్రస్మా జిల్లా గౌరవ అధ్యక్షుడు బత్తిని దేవన్న, కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, ట్రెజరర్ కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ రేగళ్ల ఉపేందర్, నస్పూర్ మండల అధ్యక్షుడు మైదం రామకృష్ణ, కార్యదర్శి ఉట్ల సత్యనారాయణ, కోశాధికారి అంబాల రాజకుమార్, ఉపాధ్యక్షుడు అమన్ ప్రసాద్, సత్యనారాయణ రెడ్డి, జుల్ఫికర్, కరస్పాండెంట్లు రమేష్, ప్రణయ్, స్రవంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలి
సీపీఐ, ఏఐటీయూసీ నేతలు రామడుగు లక్ష్మణ్, మేకల దాసు పిలుపు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: జీడీపీ పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, ఆ పెరుగుదల సామాన్య ప్రజల జీవితాల్లో ఎందుకు కనిపించడం లేదు? అని సీపీఐ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు రామడుగు లక్ష్మణ్, మేకల దాసు ప్రశ్నించారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో నిర్వహించనున్న ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్, లోగోను శనివారం మంచిర్యాల ఐబీలో ఆవిష్కరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ప్రభుత్వ రంగాన్ని బలహీనపరుస్తూ కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. దేశ సంపదను సృష్టించే కార్మికులు, రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి బడా వ్యాపారులకు అనుకూలమైన విధానాలను రుద్దుతోందని మండిపడ్డారు. జీడీపీ గణాంకాల పెరుగుదల మాత్రమే దేశ ప్రగతికి నిదర్శనం కాదని, ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధని నేతలు స్పష్టం చేశారు. దేశంలో జీడీపీ పెరుగుతుంటే నిరుద్యోగ సమస్య ఎందుకు తీవ్రమవుతోందని, కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రతతో పాటు రైతుల ఆదాయాలు ఎందుకు మెరుగుపడటం లేదని నిలదీశారు. ప్రజల ఉపాధి అవకాశాలు, వేతనాల పెంపు, సామాజిక భద్రత కల్పించినప్పుడే అసలైన ఆర్థికాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటాలు చేస్తోందని వివరించారు. కరీంనగర్లో జరగనున్న రాష్ట్ర మహాసభలను కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ఖలీందర్ అలీఖాన్, జోగుల మల్లయ్య, మిట్టపల్లి పౌలు, లింగం రవి, కొట్టే కిషన్ రావు, వనం సత్యనారాయణ, మిర్యాల రాజేశ్వర్ రావు, చాడా మహేందర్ రెడ్డి, కాదండి సాంబయ్య, ఎగుడ మొండి, పానుగంటి సత్యనారాయణ, మండ యాదగిరి, బియ్యాల రాజేశం పాల్గొన్నారు.



