మంచిర్యాల 32వ డివిజన్లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎంత త్వరగా చేకూరుతాయో అనడానికి వేగంగా పూర్తవుతున్న ఈ ఇందిరమ్మ గృహాలే నిదర్శనం అని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్లో లబ్ధిదారులైన కటకం రజిత, సత్యనారాయణ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ మహోత్సవానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి నూతన ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అండదండలతో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. గృహ ప్రవేశానికి విచ్చేసిన మేయర్ ధర్ని మధుకర్‌ను లబ్ధిదారులు మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ వార్డు అధ్యక్షులు గోపతి తిరుపతి, రెంక రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



