నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండలం షిర్కే కాలనీలో వినాయక చవితి చందాల లెక్కల విషయమై ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం పరస్పర దాడులకు దారితీసింది. ఈ నెల 23న నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా సీసీసీ కార్నర్ వద్ద కంచర్ల రమేష్, ఆయన సోదరుడు వెంకటేష్‌లపై దొమ్మటి రాజేందర్, గుర్రాల వంశీకృష్ణ దాడి చేశారు. ఈ ఘటనను మనసులో పెట్టుకుని, 24వ తేదీ అర్ధరాత్రి కంచర్ల రమేష్ తన స్నేహితులతో కలిసి రాజేందర్ ఇంటిపై కర్రలతో దాడి చేసి రాజేందర్‌తో పాటు ఆయన స్నేహితులు జగన్, రమేష్‌లను గాయపరిచారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు సీసీసీ నస్పూర్ ఎస్సై ఎండీ తహిసీనుద్దీన్ కేసులు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. శుక్రవారం ఇరువర్గాలకు చెందిన వారిని అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్ తెలిపారు. పట్టణంలో గ్రూపు తగాదాలు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
KYATHAM RAJESH
సోన్, ఆర్.కె న్యూస్: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా సోన్ మండలంలోని పాక్‌పట్లకు చెందిన పొల్కమ్ ఉదయ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి, ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.తనపై నమ్మకం ఉంచి జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన బీజేఎల్పీ నాయకులు, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్, నిర్మల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు నిరంజన్ రెడ్డికి ఈ సందర్భంగా పొల్కమ్ ఉదయ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
సోన్, ఆర్.కె న్యూస్: సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించారు. అవసరమైన మందులు అందజేశారు. చికిత్స అవసరమైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పాత టైర్లు, కూలర్లు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. దోమల వృద్ధి అరికట్టడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సాయినాథ్, ఆశా వర్కర్లు సరోజ, సుజాత, రాధా, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కుంటాల శంకర్
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన కుంటాల శంకర్ శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలను
మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు శంకర్‌ను శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుంటాల శంకర్ మాట్లాడుతూ, పార్టీలో తనపై నమ్మకం ఉంచి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కొక్కిరాల సురేఖలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, దళితుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేటర్ చింతపండు శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నస్పూర్ శ్రీలక్ష్మి గణేష్ మండలి వద్ద పూజలు నిర్వహించిన మేయర్ ధర్ని మధుకర్
ఘనంగా నిమజ్జన శోభాయాత్ర
నస్పూర్, ఆర్.కె న్యూస్: “గణపతి బప్పా మోరియా.. పుడ్చ్యా వర్షి లవ్కర్ యా” అంటూ భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక పాటలు, నృత్యాల కోలాహలం నడుమ నస్పూర్ పట్టణంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న ఆదిదేవునికి గురువారం భక్తులు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. పట్టణంలోని
శ్రీలక్ష్మి గణేష్ మండలి వద్ద అర్చకులు సముద్రాల వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్ పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా మండలి నిర్వాహకులు మేయర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో నగర ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తొమ్మిది రోజుల పాటు కాలనీల్లో భక్తిభావం, ఐక్యత వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించిన మండలి సభ్యులను, భక్తులను అభినందించారు. మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి లడ్డూ లక్కీ డ్రాలో మంచిర్యాలకు చెందిన టి. ప్రశాంత్‌కు పవిత్ర లడ్డూ ప్రసాదం దక్కింది.
అనంతరం మామిడి తోరణాలు, పూలతో సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన లారీలో గణనాథుని ప్రతిమను ఉంచి శోభాయాత్రను ప్రారంభించారు. యువతీ యువకులు సంప్రదాయ వస్త్రధారణతో భక్తి పాటలకు నృత్యాలు చేస్తూ, గులాలు చల్లుకుంటూ ఉత్సాహంగా అడుగులు వేశారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రసాదాలు స్వీకరించారు. నిమజ్జనానికి సంబంధించి ఇందారం గోదావరి బ్రిడ్జి వద్ద, గూడెం వద్ద అధికారులు క్రేన్లు, విద్యుత్ దీపాలు, గజ ఈతగాళ్లతో విస్తృత ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, సీసీసీ నస్పూర్ ఎస్సై ఎండీ తహిసీనుద్దీన్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతినిధులు జక్కినబోయిన గోపాల్, అనుమండ్ల వెంకట్‌రెడ్డి, రామగిరి బాలరాజు, మండల తిరుపతి, క్యాతం రాజేష్, టేకుమట్ల అంజయ్య, గోపతి తిరుపతి, బేర సత్యం, చిందం రాజు, చందా శ్రీనివాస్, మండల శివ, చందా శివ, మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీరాంపూర్ ఏరియా కమ్యూనికేషన్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
కంపెనీ స్థాయిలోనూ ప్రతిభ చాటాలి: స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా కమ్యూనికేషన్ సెల్ ఆధ్వర్యంలో డబ్ల్యూపీఎస్ & జీఏ సాంస్కృతిక పోటీలను ఆదివారం నస్పూర్ కాలనీలోని గోదావరి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, కో-ఆర్డినేటర్ సురేష్, జనరల్ కెప్టెన్ నరసయ్య పర్యవేక్షణలో, కల్చరల్ కెప్టెన్ మేడ పెద్దయ్య ఆధ్వర్యంలో ఈ పోటీలు
ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ పోటీలకు గోల్డ్ మెడలిస్ట్ ఫ్లూట్ రవి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ సాంస్కృతిక పోటీల్లో కళాకారులు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఫోక్ డాన్స్ గ్రూప్ విభాగంలో నీలాల శ్రీనివాస్ బృందం, కవ్వాలి విభాగంలో ఎస్కే తాజు బృందం, ఆర్కెస్ట్రా విభాగంలో మేడ పెద్దయ్య బృందం విజేతలుగా నిలిచి బహుమతులు కైవసం చేసుకున్నారు. అలాగే వ్యక్తిగత విభాగాలలో.. జానపద గీతంలో శ్రీనివాస్, ఫ్లూట్ విభాగంలో రవి, కర్ణాటక సంగీతంలో ఎస్టీపీకి చెందిన శ్రీనిధి, గజల్ విభాగంలో తాజుద్దీన్‌తో పాటు శ్రీరాంపూర్ కమ్యూనికేషన్ సెల్ కళాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్ మాట్లాడుతూ.. విజేతలకు, పాల్గొన్న కళాకారులందరికీ అభినందనలు తెలిపారు. రానున్న నవంబర్ నెలలో మణుగూరు ఏరియాలో జరగనున్న కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీల్లో శ్రీరాంపూర్ ఏరియా సత్తా చాటి పేరు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. కళాకారులంతా మరింత సాధన చేసి, కంపెనీ స్థాయిలోనే కాకుండా కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపికయ్యేలా రాణించాలని ఆకాంక్షించారు.

7వ వార్డులో ప్రత్యేక పూజలు చేసిన కట్ట వనిత–రమేష్ బాబు దంపతులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ వార్డులో ప్రతిష్ఠించిన విజయగణపతి గణేష్
మండలి వద్ద నిత్య అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ప్రతిరోజూ భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తూ మండలి సభ్యులు అందరి మన్ననలు పొందుతున్నారు. ఇందులో భాగంగా శనివారం కట్ట వనిత–రమేష్ బాబు దంపతులు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గణనాథుని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. మండలి నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణకే మొదటి ప్రాధాన్యత: నూతన ఎస్సై
నస్పూర్,ఆర్.కె న్యూస్: సీసీసీ నస్పూర్ సబ్ ఇన్స్పెక్టర్గా 2014 బ్యాచ్‌కు చెందిన ఎండీ తహిసీనుద్దీన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రామగుండం కమిషనరేట్ ఐటీ కోర్ విభాగం నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. కాగా, ఇప్పటివరకు ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వర్తించిన మేకల ప్రశాంత్ తాళ్లగురిజాలకు బదిలీ అయ్యారు. బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన ఎస్సై తహిసీనుద్దీన్ మాట్లాడుతూ.. ఠాణా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై, శాంతికి భంగం కలిగించేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాధితులు నిర్భయంగా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి సమస్యలు చెప్పుకోవచ్చని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను నిబంధనలకు లోబడి, డీజేలు లేకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మండళ్ల నిర్వాహకులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు విధిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరిస్తూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై తహిసీనుద్దీన్కు పోలీస్ స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో సిబ్బంది సమష్టిగా పనిచేసి ఠాణాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య
నస్పూర్‌లో సంఘం వెబ్సైట్ ఆవిష్కరణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ మున్నూరు కాపు (పటేల్స్) కులస్తులంతా విధిగా సంఘం సభ్యత్వాన్ని స్వీకరించి, జనాభా ప్రాతిపదికన హక్కులు సాధించుకుంటూ రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పిలుపునిచ్చారు. నస్పూర్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం సంఘం అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొండ దేవయ్య మాట్లాడుతూ… ఒకే కులం – ఒకే సంఘం నినాదంతో మున్నూరు కాపులంతా ఐక్యంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో తమ కుల జనాభాను వాస్తవ సంఖ్య కంటే తక్కువగా చూపించడం వల్ల రాజకీయంగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేర్ల చివర రావు అని ఉన్న మున్నూరు కాపులను ఇతర కులాల్లో కలపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తే, గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా నిర్లక్ష్య వైఖరినే అవలంబిస్తోందని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా సంఘం వెబ్సైట్ ద్వారా సభ్యత్వం నమోదు చేసుకోవాలని, అందరూ చొరవ చూపకపోతే జనాభా లెక్కల్లో మొదటి స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన మున్నూరు కాపు కార్పొరేషన్‌కు తక్షణమే రూ. 1,000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగాం రాజారాం, నాయకులు పానుగంటి శ్రీనివాస్, నాయకులు శ్రీపతి శ్రీనివాస్, శ్రీపతి సురేష్ కుమార్, నరెడ్ల శ్రీనివాస్, కాశ రాజు, ఆకుల మహేందర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణేష్ మండలి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు
భక్తులకు అన్నదాన వితరణ, తీర్థప్రసాదాల పంపిణీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ సింగరేణి రిటైర్డ్ కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణనాథుని మండప ప్రాంగణంలో మహిళలు పెద్ద సంఖ్యలో
పాల్గొని భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. కాలనీ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సకల శుభాలతో వర్ధిల్లాలని కోరుతూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ వినాయకుడికి విశేష పూజలు చేసిన మహిళలు, కుంకుమార్చన గావించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మహాహారతి ఇచ్చారు. అనంతరం నాంపల్లి తిరుపతి, గాండ్ల సుధీర్ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, మండలి ప్రతినిధులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలి నిర్వాహకులు మేడం తిరుపతి, ఎంబండి సమ్మయ్య, గడ్డం చంద్రయ్య, బెడద మహేందర్, కనవేని ఓదెలు, లశెట్టి గంగాధర్, రామంచ సంపత్, ఆంజనేయ ప్రసాద్, ముష్కే రవి, కాలనీ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.



